పలకరిస్తే పద్యం – పొడుపు పద్యం


“అమ్మంటే దగ్గరికి, నాన్నంటే దూరంగా పోతుంది?” లాంటి పొడుపు కథలు మనందరికీ తెలిసినవే. చిన్నప్పుడు వీటితో ఆడుకొని, మన మెదళ్లకు మేత వేసినవాళ్లమే! కానీ, మన తెలుగు భాషా భాండాగారంలో కేవలం ఇలాంటి సరదా పొడుపు కథలే కాదు, ఇంకాస్త లోతైన, కళాత్మకమైన, ఇంకో అద్భుత ప్రక్రియ దాగి ఉంది. అదే “పొడుపు పద్యాలు”! అవును, పద్య రూపంలో మనల్ని ఊరించడానికి, ఆలోచింపజేయడానికి సిద్ధంగా ఉన్న పొడుపు కథలివి!

అటు పద్యానికున్న లయ, పదాల కూర్పు, భాషా సౌందర్యం; ఇటు పొడుపు కథలో ఉండే చమత్కారం, బుద్ధి కుశలత… ఈ రెండింటినీ కలిపి ఒకేచోట అందించిన అపురూపమైన ప్రక్రియే ఈ పొడుపు పద్యాలు. వినడానికే ఎంత బాగుంది కదూ!

ఇంకెందుకు ఆలస్యం ? ఒక పొదుపు పద్యం విప్పుదామా మరి ?

సరే, మాటల్లో చెప్పడం కంటే, ఒక ఉదాహరణ చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. కింద ఒక పొడుపు పద్యం ఇస్తున్నాం. జాగ్రత్తగా చదివి, అందులో చెప్పిందేమిటో ఏమిటో కనిపెట్టడానికి ప్రయత్నించండి. మీ మెదడుకు కాస్త పని చెప్పండి మరి!

ఉన్న చోట నిలిచి యొరుల దాటింతును

పరుల నెక్కి యెపుడు బయనమగుదు

నాదు కాళ్లును రెండె, నరుని కాళ్లును రెండె

నన్ను దెలిసికొనుము చందమామ.

చదివారు కదా? చందమామనే సాక్షిగా చేసుకొని, ‘నన్నెవరో తెలుసుకో’ అని సవాలు విసురుతోంది ఈ పద్యం. ఇంతకీ దీని అర్థం ఏమిటో, ఈ పొడుపుని విడతీద్దామా ?!.  చూడండి!

  • “ఉన్న చోట నిలిచి యొరుల దాటింతును”: మొదటి పంక్తిలోనే ఓ పెద్ద క్లూ ఇచ్చాడు కవి. తాను ఉన్న చోటనే స్థిరంగా ఉంటాననీ, కదలకుండానే ఇతరులను(యొరుల) (ప్రజలు, వాహనాలు) అవతలికి చేరవేస్తాననీ చెబుతోంది. భలే వింతగా ఉంది కదూ!
  • “పరుల నెక్కి యెపుడు బయనమగుదు”: రెండో వాక్యంలో మరో సూచన. తాను ఇతరులను ఆశ్రయించి వారి మీద ఎక్కి గానీ ఎప్పుడూ ప్రయాణం చేయను అంటోంది. అంటే దీనికి సొంతంగా కదిలే లక్షణం లేదన్నమాట.
  • “నాదు కాళ్లును రెండె, నరుని కాళ్లును రెండె”: ఇక ఇది చాలా కీలకమైన పాదం !( పద్యంలో ఒక లైన్ ని పాదం అంటారు) మనిషికి ఉన్నట్లే తనకూ రెండే కాళ్లున్నాయని పోల్చుకుంటోంది. రెండే కాళ్లు… ఏమిటది? కాళ్లు అనే పదంలో ఏదైనా గూడార్థం ఉందా?
  • “నన్ను దెలిసికొనుము చందమామ”: ఇన్ని ఆధారాలు ఇచ్చాక, ఇక నన్నేమిటో గుర్తుపట్టమని చందమామ ద్వారా మనల్ని అడుగుతోంది.

 

సమాధానం: 

ఇప్పటికే మీలో చాలామందికి సరైన సమాధానం మెదడులో మెరిసి ఉంటుంది! ఒకే చోట స్థిరంగా ఉంటూ, ఇతరులను సురక్షితంగా దాటిస్తూ, స్వయంగా ప్రయాణించకుండా, మనిషిలాగే రెండు కాళ్లు (ఆధారాలు) కలిగిన వస్తువు ఏమై ఉంటుంది?

(ఒక్క క్షణం ఆలోచించండి…)

అదేనండి… నిచ్చేన! అవును, ఒక ladder అంటారు ఇంగ్లీష్ లో ! ఎంత బాగా సరిపోయిందో చూడండి. నిచ్చేన! ఎప్పుడూ ఒకేచోట స్థిరంగా ఉంటుంది. దానిపై నుంచే కదా మనం పైకికానీ కిందకి కానీ దిగుతాం. నిచ్చేన! దానికి సాధారణంగా రెండు వైపులా బలమైన ఆధారాలు, కర్రలు ఉంటాయి( ఈ రోజుల్లో నాలుగు కాళ్ళ నిచ్చెనలు కూడా వస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం.) కవి వాటినే చమత్కారంగా మనిషి ‘కాళ్లు’ అని పోల్చి పద్యానికి అందాన్ని, ఆలోచనను తెచ్చిపెట్టాడు!

నిజంగా, ఇలాంటి పొడుపు పద్యాలు మన తెలుగు భాషకు, సాహిత్యానికి అమూల్యమైన ఆభరణాలు. ఇవి కేవలం కాలక్షేపం కోసం పుట్టినవి కావు. మనల్ని ఆలోచింపజేసి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా చూసేలా చేస్తాయి, మన పరిశీలనకి పదును పెడతాయి, అన్నింటికీ మించి మన మాతృభాషలోని తీయదనాన్ని, పద్యంలోని మాధుర్యాన్ని, పదాల చమత్కారాన్ని మనకు పరిచయం చేస్తాయి.

పద్యంలోని లాలిత్యాన్ని, పొడుపులోని గడుసుదనాన్ని ఒకేచోట రంగరించి అందించే ఇలాంటి అపురూపమైన సాహిత్య ప్రక్రియలను మనం మర్చిపోకూడదు. వాటిని వెలికితీసి, ఆస్వాదించి, ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈ “పలకరిస్తే పద్యం”.  ఇలాంటి మరిన్ని సరదా పద్యాలను వెతికేసి మీకు ఒచ్చే సంచికలో తెచ్చేస్తాము. అప్పటి దాకా సెలవు.  

error: Content is protected !!