సీరియల్ నవల : మహి- మూడో భాగం

ఇప్పటివరకు జరిగిన కథ:

నందనకు అంతర్జాతీయ కాల్ సెంటర్‌లో పదివేల రూపాయల జీతంతో ఉద్యోగం రావడంతో ఇంట్లో, ముఖ్యంగా మనవరాలి కోసం పూజలు చేసిన అమ్మమ్మ వైదేహి ఆనందానికి అవధులు ఉండవు. తల్లి మాధవి కూడా సంతోషిస్తుంది. అయితే, ఉద్యోగం వచ్చిన ఆనందంలోనే నందన వెంటనే తనకు టూ-వీలర్, సెల్ ఫోన్ కావాలని పట్టుబడుతుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాధవి అందుకు నిరాకరిస్తుంది. మరోవైపు, నందన తన స్నేహితుడు విక్రమ్ సహాయంతో తిరుగుతూ, అతని వద్ద తమ కుటుంబం గురించి గొప్పలు చెబుతుంది, తమ ఇల్లు చూస్తే తన బండారం బయటపడుతుందని కంగారుపడుతుంది.

ఈ సమయంలో, నందన పిన్ని (మేనత్త) అయిన కథానాయిక మహి వారి ఇంటికి వస్తుంది. నందన ఉద్యోగం గురించి, మారుతున్న కాలం గురించి, ఇప్పుడు యువత సులభంగా బైకులు, సెల్ ఫోన్లు, కార్లు కోరుకోవడం గురించి వైదేహి మహితో చెబుతుంది. తన వద్ద ఒకప్పుడు ఉన్న నగలు కరిగిపోయాయని కూడా ప్రస్తావిస్తుంది. ఇంతలో, నందన తండ్రి భాస్కర్ రావడం, నందనకు బైక్, సెల్ ఫోన్ అవసరం గురించి ప్రస్తావన రావడం జరుగుతుంది. భాస్కర్ నవ్వుతూ, ఆ ఖర్చును మహి భరిస్తుందని, నందనకు బహుమతిగా కొనివ్వమని సూటిగా అడుగుతాడు. మాధవి కూడా అతని మాటలను సమర్ధిస్తున్నట్లు చూస్తుంది.

పిల్లల చదువులకు, అవసరాలకు తను గతంలో ఎన్నోసార్లు సహాయం చేసినా, అనవసరమైన ఖర్చులకు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడని మహి, వారి మాటలకు ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో, క్రికెట్ ఆడి వచ్చిన నందన తమ్ముడు కార్తీక్‌ను చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని మాధవి మందలించడం, భాస్కర్ కొడుకును వెనకేసుకు రావడం వంటి కుటుంబ సంభాషణలు జరుగుతాయి. విక్రమ్ కింద కారులో ఉన్నాడని, అతను తన గురించి అడుగుతాడేమోనని తాను వెళ్ళేవరకు మహిని అక్కడే ఉండమని నందన కోరుతుంది. చివరకు, భాస్కర్, మాధవి గుడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా, మహి వారి ఇంటి నుంచి బయలుదేరుతుంది.

తరువాత … 

ఆ వీధిని తిరగేవారికి చల్లని నీడనిస్తూ చూపులకి ఆహ్లాదాన్నిస్తూ దారికి యిరువైపులా దట్టంగా పెరిగిన గులెహర్. కరెంట్ తీగలకీ, టెలిఫోన్ వైర్లకీ అడొస్తున్నాయని డబ్బులిచ్చి తరచుగా వాటి కొమ్మలని కొట్టిస్తుంటారు. పువ్వుల కాలంలో ఆ వీధంతా యెండా వెన్నెల వాన యెర్రగా కురుస్తుం టాయి. అపార్ట్మెంట్ పార్కింగ్లో మహి కారు పార్కు చేసింది. పోస్ట్బాక్స్ వైపు వెళ్ళింది. తన పేరు రాసున్న పోస్ట్బాక్స్ తాళం తీసి వచ్చిన పోస్టు తీసు కొంది. సాహిత్యసభల ఆహ్వాన లేఖలు విప్పి చూస్తూ లిఫ్ట్ వైపు వెళుతుంటే వాచ్మెన్ యెదురొచ్చాడు.

“పుస్తకాలొచ్చాయమ్మా,” అంటూ గబగబా తనుండే కుర్చీవైపు వెళ్ళాడు. నూకరాజుకి యాభై యేళ్ళుంటాయి. బక్కపల్చగా వుంటాడు. నెరిసిన జుట్టు. అపార్ట్మెంట్కి కాపలా కాయటం, కార్లు తుడవటం, యెవరైనా దుకాణానికి పోయి సామాన్లు తెమ్మంటే తీసుకురావటం, యే పనీ లేనప్పుడు టీవీ చూస్తుంటాడు. వుదయం యెవరో వొకరికి వచ్చిన తెలుగు పేపర్ వాళ్ళు లేవక ముందే చదివి తిరిగి అక్కడ పెట్టేస్తాడు. సాయంకాలం పక్కనున్న బస్తీ వైపు వెళతాడు. వో రెండు గుటకలు తాగి పక్కనున్న బస్తీ వైపు వెళతాడు. వో రెండు గుటకలు తాగి అక్కడ చేరిన తన వూరివాళ్ళతో, మిగిలిన వాచ్ మెన్­తో కబుర్లాడి యింటికి వస్తాడు. ‘కోడిగుడుతో, కోడికూరో లేకపోతే ముద్ద దిగదమ్మా. రోజూ యెక్కడి నుంచి తెస్తాం,’ అని వాళ్ళావిడ సింహాద్రి నవ్వుతూనో, చికాకుతోనో మొత్తుకుంటుంటుంది. సింహాద్రికి ముప్ఫై ఐదేళ్ళుంటాయి. నూకరాజు పెద్ద భార్య పోయాక సింహాద్రిని పెళ్ళి చేసుకొన్నాడు. సింహాద్రి వుదయం నుంచి సాయంకాలం వరకు ఆ ఫ్లాట్ లోనే పని చేస్తుంది. నూకరాజు ఔట్లుక్ తెచ్చిచ్చాడు.

మహి యింట్లోకి వచ్చి లైట్ వేసింది. పొడవైన హాలు. లిల్లీవైట్ రంగులోని గోడలు. అవే రంగులో టైల్స్. వో గోడవారగా ఫైన్ ఫినిషింగ్ వున్న జూట్ కార్పెట్ పై రెండు లో లెవల్ కుర్చీలు. వాటి నడుమ చిన్న టీపాయ్. చిన్ని పుస్తకాల స్టాండ్ పై లేటెస్ట్ మ్యాగజైన్స్. వో పక్క గోడకి నారతో చేసిన లో లెవల్ మోడాలు. వాటిపై లేత పసుపు రంగున్న పల్చని కుషన్స్. మరోవైపు గోడవారగా మెరూన్ బోర్డర్­తో యీతాకులతో అల్లిన చాప, దాని మీద తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, నలుపురంగుల కవర్స్ వున్న కుషన్స్, కొన్నిటి మీద హేండ్ యెంబ్రాయిడరీ. మరికొన్నిటిపై చిన్నచిన్న అద్దాలు కుట్టి వున్నాయి. ఆ చాపకి కాస్త పక్కగా మట్టితో చేసిన రకరకాల సైజుల్లో యేనుగుల గుంపు. వాటి పక్కనే నల్లని బిపిఎల్ కలర్ టీవీ. వంటింటి పక్కనే తెల్లని ఫ్రిజ్. గోడ మీద వెదురుతో చేసిన ఫ్రేమ్­కి  జూట్ క్లాత్ అంటించిన సైన్ బోర్డ్. దాని మీద కొన్ని కవితలు, పాటలు తెలుగువి, యింగ్లీషువి పిన్ చేసున్నాయి. లేత పసుప్పచ్చ పై తెల్లని మల్లెమొగ్గల ప్రింట్ వున్న కాటన్ కర్టెన్స్. క్రిక్కిరిసిన దారుల్లోంచి ప్రయాణించి యీ యింట్లోకి రాగానే కళ్ళకి తెరిపిచ్చి నట్టంటుంది. కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగింది. వస్తూ వస్తూ కొనుక్కొచ్చిన జాజిపూల మాలని వో యేనుగు మెడలో వేసింది. గదంతా పూల పరిమళం.

వంటగదిలోకి వెళ్ళి బియ్యం కడిగి కుక్కర్ పెట్టింది. ఫోన్ మోగింది. కార్డ్­లెస్  తీసుకొంది.

“గుడి నుంచి వచ్చేసాం. ఆ కారు యెంత బాగుందో. యేసీ. మ్యూజిక్ సిస్టమ్ వుంది. ఆ అబ్బాయి యెంత బుద్ధిమంతుడనుకున్నావ్. ఫ్రంట్లో తన పక్కనున్న సీట్లో కూర్చోమన్నాడు. గుళ్ళోకి వచ్చాడు. తరచు గుడికి వెళతాడంట. మాధవి వాళ్ళు యింకా రాలేదు. ఆ గుడి యెంత బాగుందను కున్నావ్. పంజాగుట్ట అంటారంట ఆ యేరియాని. అక్కడ నుంచి వస్తుంటే దారిలో కారాపించి నందూ ఐస్క్రీమ్ తీసుకొంది. యెంత బాగుందో. ఆ కారు యెంతుంటుందంటావ్,” అడిగారు వైదేహి.

భుజానికి చెవి నొక్కిపెట్టి కార్డ్­లెస్ వింటూ వంకాయలు కట్ చేస్తున్న మహి నవ్వుతూ, “యే కారు అది?” అడిగింది.

“యాక్సెంట్.”

“చాలా నచ్చిందా?”

“….”

“నందూని అడుగు, కరెక్ట్ ధర చెపుతుంది,” అంది మహి.

“నందూకి సెల్­ఫోన్ కొనివ్వాలని వుంది. కాస్త తెచ్చిపెడతావా?” అడిగారు వైదేహి. 

నిశ్శబ్దం.

అమ్మమ్మ యిలానే వుండేది. కూతుళ్ళ పిల్లలు యేం అడిగినా యెలాగోలా వాళ్ళకి వాటిని సమకూర్చాలని చాలా తాపత్రయపడేది. అప్పట్లో యిన్ని రకాల వస్తువులు మార్కెట్లో లేవు. యిక్కడ తయారైన చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్ మాత్రమే వుండేవి. యెంత డబ్బున్నా వాటిల్లోనే తీసుకోవాలి. పిల్లల బొమ్మలు, బట్టలు, చిరుతిళ్ళు, యింట్లో వస్తువులు… యేవైనా సరే, కొన్ని రకాలే. యిప్పుడున్నన్ని రకరకాలవి లేవు. ఆ చాక్లెట్స్, ఆ పట్టు పరికిణీలు, చిన్నచిన్న చెవిపోగులు, కాళ్ళపట్టాలు యెలాగోలా అడిగిన మనవరాళ్ళకి, మనవళ్ళకి అమర్చేవారు అమ్మమ్మలు. వెరైటీ పెరగటంతో యీ అమ్మమ్మలు వాటిని సమకూర్చటం కష్టమవుతుంది. అయినా యెలాగోలా వాళ్ళకి కావల్సినవి యిస్తూనే వున్నారు.

మహీకి తన స్టూడెంట్ అమి గుర్తొచ్చింది. అమి చదువుకోవటానికని స్టేట్స్ వెళుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మగారు తను దాచుకొన్న కొద్ది డబ్బులు అమికి యిచ్చారు. అమికి కావల్సినవి డబ్బులు అమర్చిపెట్టే స్తోమత యింట్లో వాళ్ళకి వున్నా సరే ఆవిడ, ‘అరే నేనివ్వకపోతే యెలా,’ అని అమికి డబ్బులు యిచ్చింది. అమి యీమధ్య మెయిల్ యివ్వలేదు. యెలా వుందో…

“యేంటి మాట్లాడవ్,” తిరిగి వైదేహి అడిగారు.

యింతింత పెద్ద పెద్ద వస్తువులు యెవరికి వాళ్ళే అమర్చుకొంటే బాగుంటుంది. అవసరం లేని వస్తువులు పోగు వేయటం వేస్ట్ ఆఫ్ మని… మార్కెట్ లోకి వచ్చినవన్నీ కావాలనే ఆరాటాన్ని యెంకరేజ్ చేయకూడదని చెప్తామని వున్నా మహి చెప్పలేకపోయింది. యీ విషయాలపై అమ్మకి, మాధవికి సరియైన అవగాహన లేదు. యింటా బయటా యిటువంటి మనుష్యులే నందన చుట్టూ. నందూకి కనిపించేవన్నీ పోగు వేసుకోవాలనే వుంటుంది. యిటువంటి వాతావరణంలో భిన్నమైన ఆలోచనలు నందూకి యెలా వస్తాయి. అడిగినవి యివ్వకపోతే బాధపడుతుంది.

“వంట చేస్తున్నా. రేపు వస్తాను కదా మాట్లాడదాం,” అంది మహి.

“యేం కూర?”

“వంకాయ వేపుడు. వుదయం పెట్టిన పప్పుచారుంది. వేడి చేస్తాను. గుమ్మడి కాయ వడియాలు వేయించినవి వున్నాయి. కేరెట్ సలాడ్,” చెప్పింది మహి.

“రేపు వచ్చినప్పుడు వీలైతే ఆ యిన్­స్ట్రుమెంట్ పట్రా. నందూతో వెళ్ళి తనకి కావల్సిన సిమ్­కార్డ్  కొంటాను,” అన్నారు వైదేహి.

సిమ్­కార్డ్… మహి పెదవులపై చిరునవ్వు.

వైదేహిగారు పదవ తరగతి పాసయ్యారు. సూర్యప్రకాశరావుగారితో పెళ్ళయింది. ఆయనకి కన్యాశుల్కం నాటకమంటే యిష్టం. నాటకాలు వేయటం ఆయనకి సరదా. పెద్దకొడుకు పుట్టినప్పుడు ఆయన నాటకాలలో తనకి నచ్చిన పేర్లన్నింటినీ పరిశీలించారు. కొడుక్కి గిరీశం అని పేరు పెడతా నని ఆయన అన్నారు. జాతక నక్షత్రం ప్రకారం గ అనే అక్షరం కలవదని సూర్యప్రకాశరావుగారి అమ్మగారు అన్నారు. అసలదేం పేరని ఆయన తండ్రి గారు యింతెత్తున లేచారంట. అసలీ గొడవంతా యేమిటని వైదేహిగారు ఆ నాటకమంతా చదివారు. అయ్యో ఆడపిల్ల పుట్టుంటే మధురవాణి అని పేరు పెట్టేవాళ్ళమని వాపోయారు. వైదేహిగారు రెండవ కాన్పులో ఆ పని చేస్తారేమోనని సూర్యప్రకాశరావుగారికి భయం పట్టుకొంది. ఆయన వెంటనే తన మనసు మార్చుకొని తల్లి కోరినట్టే జాతక నక్షత్రానికి సరిపడేట్టు ఆర్ అక్షరంతో మొదలయ్యే రామచంద్రరావు అని పేరు పెట్టారు. రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టగానే మధురవాణి అని పేరు పెడదామని వైదేహిగారు అడిగారు. ససేమిరా వీల్లేదన్నారు సూర్యప్రకాశరావుగారు. అటూ యిటూ చేసి చివరికి మాధవి అని పెట్టారు. మాధవి తర్వాత చక్రపాణి, మమత కవలపిల్లలు. ఆ తర్వాత మహి. మాధవి పేరు విషయంలో తన మాట చెల్లనందుకు ఆవిడ మిగిలిన పిల్లల పేర్ల విషయంలో కల్పించుకోలేదు. గత యెనిమిదేళ్ళుగా మారుతోన్న కాలంలో వస్తున్న విషయాల పట్ల ఆసక్తి కలిగింది. కంప్యూటర్ యెలా ఆన్ చెయ్యాలో తెలుసుకొంది. యింటర్నెట్ రాగానే నెట్ని యెలా చూడాలో, మెయిల్ యెలా యియ్యాలో తెలుసుకొని ప్రాక్టీసు చేసింది. పుస్తకాలు చదవటం, టీవీ చూడటం, కొత్త ప్రదేశాలు చూసిరావటం, తన యింట్లోని విషయాలు, తన పిల్లల యింట్లో విషయా లని తెలుసుకోవటం, కల్పించుకోవటం. వైదేహిగారిలో మార్పుని గమనించింది మహి. యెందుకిలా జరిగిందని ఆలోచించింది. మరింత దగ్గరగా తల్లిని చూస్తుంటే మహికి కొన్ని విషయాలు తట్టాయి. తల్లితో మాట్లాడాలని అనుకోవటమే కాని అవ్వటం లేదు.

అన్నం తిని పాలు తోడు పెట్టింది. స్నానం చేసొచ్చి మ్యూజిక్ ఆన్ చేసింది. తిరుగుతోన్న సి.డి తీసేసింది  Frank Sinatra, our love affair… సి.డి  పెట్టింది. మంచం యెదురుగా వున్న కిటికీ కర్టెన్ని పక్కకి జరిపింది. మస్కిటోనెల్ని కాస్త తీసి వో కిటికీ రెక్క తెరిచింది. బాల్కనీలో వాల్తున్న వెన్నెల. వొకదాని వెంట వొక పాట. వింటోంది. You’re lonely and I’m lonely… వింటుంటే తిరిగి తిరిగి అదొక్కటే వాక్యం గుర్తొస్తోంది.

వొక్కసారి ఫోన్ చేస్తే… అనుకొంది. Be careful it’s my heart… అని ముందు సాగిన వో పాట గుర్తొచ్చింది.

యెప్పుడూ సందిగ్ధమే. యేవో భయాలు. యెందుకిలా… మాట్లాడితే యేమవుతుంది. మహీ వద్దు. నువ్వు కావాలనుకుంటుంది అంత తేలిగ్గా దొరకదు. నీవన్నీ వుత్తి భయాలు మహీ… మాట్లాడు. కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని మాట్లాడు. అతను వింటాడు… అందరిలాంటి వాడుకాడనుకొంటా… యిలా యింతకు ముందు యెప్పుడూ అనుకోలేదా మహి. యింత బలంగా యెవ్వరితో మాట్లాడాలనిపించలేదుగా. నెంబర్ డయల్ చేసింది. రింగ్ అవుతోంది. నో రిప్లయ్. చైత్రా… తియ్… యెక్కడికి వెళ్ళావ్… మాట్లాడాలనుకున్నప్పుడు యీ అబ్బాయి దొరకడు… మ్యూజిక్ వింటూ మంచంపై వాలింది.

నందన కార్డ్ లెస్ తీసుకొని బాల్కనీలోకి వచ్చింది. యింట్లో అంతా నిద్రపోతున్నారు. యెంతసేపు మాట్లాడుకొన్నా పర్లేదిప్పుడు. వాళ్ళు లేచుంటే యేదో వొక అర్జెంట్ కాల్ వస్తుందని వొకరు… కాల్ చేసుకోవాలని వొకరు ఫోన్ అడుగుతూనే వుంటారు. మమ్మీకి, డాడీకి సెల్ఫోన్స్ వున్నాయి. అయినా వాళ్ళు యీ ల్యాండ్లైన్ అడుగుతూనే వుంటారు. యెలాగైనా సెల్ కొనిపించుకోవాలి. మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాతయ్య, పిన్ని… యెవరో వొకరు కొనివ్వరా… పిన్ని డౌట్. మమ్మీని అడిగితే కొన్నిసార్లు యిస్తుంది, కొన్నిసార్లు యివ్వదు. మిగిలిన వాళ్ళలో యెవరో వొకరు కొనిపెట్టకపోతారా అనుకొంది. నందన నెంబర్ డయల్ చేసింది. నెంబర్ చూసి ఆన్ చేసి “హలో… స్వీట్ నందూ,” సాగదీస్తూ అన్నాడు వేణు. వేణు, నందన సెవెన్త్ క్లాస్ నుంచి వొకే స్కూల్లో చదువుకున్నారు.

“అంతలేదు బాబు, యేం చేస్తున్నావ్,” అడిగింది నందన.

“చాట్ చేస్తున్నా.”

“యెవరితో తెలిసినవాళ్ళా… తెలియనివాళ్ళా.”

“తెల్లపిల్ల… నిన్న పరిచయం. హాబీస్ యేమిటో తెలుసా… ప్రపంచంలో యిప్పటి వరకూ వచ్చిన కార్ల మోడల్ ఫోటోస్ కలెక్ట్ చేయడం,” చెప్పాడు వేణు.

“యూ ఆర్ వెరీ లక్కీరా. యింట్లోనే నెట్ వుంది. మా డాడీ కనెక్షన్ తీసు కుందామంటే వొప్పుకోరు. ఆయనకి యింగ్లీషులో లీవ్ లెటర్ రాయటమే రాదు. మెయిల్ నెట్ యింట్రెస్టేం వుంటుంది. మాకు అవసరం కదా. వొప్పుకోరు,” అని ఆగి నవ్వుతూ, “పైగా నెట్ వుంటే చదవరు… స్పైసీ సైట్స్ చూస్తారు… తెలియని వాళ్ళతో చాట్ చేస్తారు… యిలా నాన్సెన్స్ నాలెడ్జ్ యేమేమో మాట్లాడతారనుకో. యిప్పుడు యింట్లో నెట్ లేదని బయటికి వెళ్ళి మెయిల్ వాడుతున్నామా… నెట్ చూస్తాం. చాట్ చేస్తు న్నామా… మానేస్తున్నాం యేంటి… యింట్లో వుంటే కన్వీనియంట్గా వుంటుందని… బోర్… అర్థమే కాదు,” అంది నందన.

“చాట్ చేస్తే యేమవుతుంది. మనకి తెలుసుకదా… యిన్ఫర్మేషన్ని యెలా యూజ్ఫుల్ గా వాడుకోవచ్చో. ఫనికి కూడా యూజ్ చేస్తాం. సో వాట్… కనెక్షన్ పెట్టు… న్యూన్యూ ఫ్రెండ్స్… రియల్లీ యిట్స్ ఫన్…” అన్నాడు వేణు.

“ట్వెంటీ యియర్స్ వచ్చాయి. మనకి యేం కావాలో మనకి తెలియదా యేంటి. వూఁ సరే. వుద్యోగం వచ్చింది. పే తక్కువే. టెన్ థౌజండ్. మమ్మీని సెల్ కొనివ్వమని అడిగా. వెహికల్కి ముందు కట్టాల్సిన మనీ కట్టమని అడిగా. యింట్లో మమ్మీ డాడీ యిద్దరూ సంపాదించేవాళ్ళే. కానీ యేంటో యెప్పుడూ డబ్బులు లేవనే అంటుంటారు. అంతా సేవ్ చేస్తా రనుకుంటా. సేవ్ చేసి యేం చేస్తారో,” చికాగ్గా అంది నందన.

“మా డాడీ అంతే. బోల్డన్ని అద్దెలు వస్తాయా, వడ్డీలకి యిస్తారా. యేం అడిగినా యెందుకంటారు. కారు కొనుక్కొంటానంటే వొప్పుకోరు. సేవ్ చేయటం వోల్డ్ పద్ధతి. హాయిగా యెంజాయ్ చేయకుండా. నాన్న కూడా వొక కారు కొనుక్కుని డ్రైవర్ని పెట్టుకోవచ్చు. చేయరలా. అంతా వోల్డ్ థింకింగ్… నందూ… కంగ్రాట్స్ చెబుతుంది యీ చాట్ ఫ్రెండ్… నీతో మాట్లాడుతూనే నీకు జాబ్ వచ్చిందని తనకి చెప్పాను,” అన్నాడు వేణు.

“థాంక్స్ చెప్పు. మమ్మీ సెల్ కొనిస్తే నీకు ఎస్ఎంఎస్ చేయొచ్చు. నెట్ కూడా పెట్టించేసుకుంటా,” హుషారుగా అంది నందన.

“త్వరగా పెట్టించుకో. రేపు పార్టీ…” అడిగాడు వేణు.

“ష్యూర్… కొత్తగా ఫ్రెండ్ అయ్యాడని చెప్పానుగా విక్రమ్, నువ్వూ నేను వెళదాం,” అంది నందన.

“తనేమో కారులో వస్తాడు. మనిద్దరం బైక్ మీద వెళితే బాగుండదేమో,” అన్నాడు.

“రేపు నీ కారు సర్వీస్కిచ్చాం.”

“గుడ్ ఐడియా… సర్వీస్కిచ్చాం,” నవ్వుతూ అన్నాడు వేణు.

“సీ యూ టుమారో… గుడ్నైట్” చెప్పింది నందన.

మహి తన చివరి గంట పాఠం చెప్పి బయటికి వచ్చింది.

యింటికొచ్చి తల్లిని బయటికి తీసుకువెళతానని తల్లికి ఫోన్ చేసి వుదయమే చెప్పింది. మాధవి యింటికి వెళ్ళేసరికి యింట్లో వైదేహి వొక్కరే వున్నారు. కాస్త గతుకుల రోడ్డు నుంచి విశాలమైన కిక్కిరిసిన రోడ్డుల నుంచి ప్రయాణించి కారు పంజాగుట్టలో ఓ వజ్రాల కంపెనీ షోరూమ్ ముందు ఆగింది.

“నువ్వు వజ్రాలని కొనమని చూస్తున్న యాడ్స్ యీ కంపెనీ ఉందా,” అడిగింది మహి.

ఆమె బోర్డ్ చూసి, “వుంది,” అన్నారు.

“దా,” అడుగేస్తూ అంది మహి.

“యిక్కడికెందుకు,” సందేహంగా అడిగారు వైదేహి.

ఆమె తటపటాయింపుగా అక్కడే ఆగిపోయారు. యేమిటన్నట్టు చూసింది మహి.

“యేంలేదు. ఆ కొనేదేదో చిన్నవైనా చెవులకి కొనరాదా. వేలికున్న వుంగరం యేమంత బాగా కనిపిస్తుంది. యేంతవుతాయో తెలీదుగాని,” అన్నారామె.

“వూఁ… దా,” అంది మహి.

గ్లాసు తలుపుతీసి పట్టుకొన్నాడు తెల్లని కోటు యూనిఫామ్ వేసుకొన్నతను. యే.సి. చల్లదనం, యిన్ స్ట్రుమెంటల్ చానల్ మ్యూజిక్ మెల్లగా వినిపిస్తోంది. లేతగా వున్న దీపాల వెలుగు. చాక్ లెట్ కలర్ గ్రానైట్ ఫ్లోరింగ్. కోరా రంగులో వున్న గోడల రంగు. ఆ ప్లెయిన్ గోడపై అందమైన యువతి బ్లాక్ అండ్ వైట్ నిలువెత్తు ఫోటో చిరునవ్వుతో. ముక్కుకి, చెవిపై, చేతిపై మెడలో మెరుస్తున్న వజ్రాలు. ఆ వజ్రాల పై స్పెషల్గా ఫోకస్ అవుతోన్న లైట్. మిలమిలలాడుతున్న ఆ వజ్రాలపై నుంచి వైదేహి చూపులు మరల్చుకోలేక పోయారు. వో పక్కగా కౌంటర్ కౌంటర్ దగ్గర ఫ్రెష్ గులాబీలు అమర్చిన వాజ్. బ్లేజర్ వేసుకున్న వో పద్దెనిమిదేళ్ళ అమ్మాయి చిర్నవ్వుతో వీళ్ళ దగ్గరికి వచ్చి, “హాయ్ మేమ్… ప్లీజ్ కమ్… లైక్ టూ హేవ్ వాటర్,” అని చిరునవ్వుతో అడిగింది.

లేత గులాబిరంగు లిప్వజ్ మెరుస్తోన్న పెదవులు. ఐ లైనర్తో తీర్చిదిద్దిన కళ్ళు. ఆర్ట్స్ షేప్ చేయించుకొన్న ఐబ్రోస్. బాబ్ హెయిర్.

“నో… థ్యాంక్ యూ,” అంది మహి.

“మే ఐ హెల్ప్ యూ మేమ్.”

“టాప్స్ కావాలి.”

ఆ అమ్మాయి చాలా వినయంగా చకచకా వీళ్ళిద్దర్ని లోపలికి తీసుకు వెళ్ళింది. అక్కడ మరో అమ్మాయికి వీళ్ళని అప్పజెప్పింది.

చిన్ని రౌండ్ టేబుల్, సిల్వర్ కలర్ చిన్న కుర్చీలు. వాటిని లాగి కూర్చోమంది. ఆ అమ్మాయి. యింకో అమ్మాయి అందమైన చిన్ని గాజుగ్లాసుల్లో కూల్ డ్రింక్స్ తీసుకొచ్చింది. మహి థ్యాంక్స్ చెప్పి సున్నితంగా వద్దంది.

వజ్రాలు పొదిగిన చెవికమ్మలు చూపిస్తోంది ఆ అమ్మాయి. తల్లికి నచ్చినవి బిల్ చేయమంది మహి. బేరం చేయకుండా వాళ్ళు చెప్పిన ధరకే వాటిని కొనటం వైదేహిగారికి నచ్చలేదు. ఆ చల్లని మిలమిల వాతావరణం ఆమె లోని మాటల్ని బయటికి రానివ్వలేదు.

షాప్ నుంచి బయటికి వచ్చాక. “బేరం చేయకుండా కొన్నావేంటి.” అన్నా రామె.

మహి నవ్వి, “బేరాలు చేయటంలో నువ్వు మంచి దిట్టవి కదా, మాట్లాడలేదేం ?”

“నోట్లోంచి మాటలు రాలేదు. నందూకి సెల్ కొందాం,” అడిగారామె.

మహి కారు స్టార్ట్ చేసి కెబిఆర్ పార్క్ వైపు వెళుతూ, “ఇక్కడంతా నడవటానికి తయారుచేశారు,” అని చెప్పింది.

“యిటున్నాయా కొనే షాప్స్,” అడిగారామె.

“నందూకి సెల్ యెందుకమ్మా?” అడిగింది మహి.

“సరదా పడుతోంది. యిప్పుడు అంతా వాడుతున్నారుగా,” అన్నారామె.

“తనకి యిప్పుడు సెల్ కంటే వెహికల్ ముఖ్యం. వెళ్ళి రావడానికి బండి వుంటే కంఫర్టబుల్ గా వుంటుంది. తనకి కావాల్సిన వెహికిల్ యివ్వు,” అంది మహి.

“బండెందుకు? వాళ్ళ అమ్మ యిన్­స్టాల్మెంట్స్ కడుతుందిలే.” అన్నా రామె.

నిశ్శబ్దం.

“పోనీ రెండూ కొనిద్దామా,” తిరిగి అడిగారామె.

“ఆ సెల్ ఫోన్ విషయం అటుంచు. బండి విషయం కనుక్కో,” అంది మహి. బండి కంటే యిన్ స్ట్రుమెంట్ తక్కువ అవుతుంది. అయినా బండి కొంటానికి డబ్బులు యిస్తానంటుంది. కానీ సెల్ఫోన్ వద్దంటుందెందుకని… మహీకి వాళ్ళందర్నీ చూస్తే అసూయగా వుంటుందేమో. ముప్పై ఏళ్ళు రాబోతున్నాయి. పెళ్ళి లేదు. పిల్లలు లేరు. అసూయ వుంటే వుంది కాని వొక్కర్తి డబ్బులన్ని యేం చేసుకొంటుంది. ఆ మాత్రం తోబుట్టువులకి పిల్లలకి పెట్టలేదా… చెవిపోగులు కొంది, వుంగరం కూడా కొనొచ్చుగా. కొనలేదు… 

“కాఫీ తాగుతావా,” అడిగింది మహి.

“వు…”

చెట్నీస్ రెస్టారెంట్ దగ్గర ఆపింది కారు. వాలే పార్కింగ్ అతనికి కీస్ ఇచ్చింది.

లోపలికి వెళ్ళాక చుట్టూ చూస్తూ, “నువ్విక్కడికి రోజూ వస్తావా,” అడిగారామె.

“అప్పుడప్పుడు.”

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ… పాట వినిపిస్తోంది స్పీకర్స్­లోంచి.

యిచ్చిన మెనూకార్డ్ వైపు చూస్తూ, “యేం తింటావ్?” అడిగింది మహి.

“ఆ… ఆకలేయటం లేదు. భోజనం చేసే వచ్చానుగా,” అన్నారామె.

“చెప్పు యేం తింటావో. యిక్కడ స్టీమ్ దోశె వుంటుంది. బాబాయ్ యిడ్లీ, గుంటూరు యిడ్లీ… వుష్మా… అన్నీ వుంటాయి చెప్పు.” అంది మహి.

“స్టీమ్ దోశె అంటే,” అడిగారామె.

“ఆయిల్ లేకుండా చేస్తారు.”

“కాస్త రుచి చూస్తా.” అన్నారామె.

“వొక స్టీమ్ దోశె, వొక ప్లేట్ యిడ్లీ… టూ కాఫీ,” చెప్పింది మహి.

“షిర్డీ వెళుతున్నాం… టికెట్స్ మాధవీ వాళ్ళు తీస్తారు. బస యేర్పాట్లు కూడా వాళ్ళే చూస్తారు. అయినా చేతిలో కొంత వుండాలి కదా… తెచ్చిన డబ్బు అయిపోయింది. కొంచెం డబ్బులు యివ్వు,” అడిగారామె.

“యెంత కావాలి?” అడిగింది మహి.

“ఐదువేలన్నా చేతిలో వుండొద్దా.”” అన్నారామె.

మహి వొక్కక్షణం తల్లి కళ్ళల్లోకి చూసింది. ఆమె చూపులు మరల్చుకొన్నారు. టికెట్స్, బస వాళ్ళే పెట్టుకొంటున్నప్పుడు రెండురోజుల ప్రయాణంలో ఐదువేల రూపాయలు పై ఖర్చుకి అంటే మహి నమ్మలేదేమో అనుకొన్నారామె. మహి సెల్­ఫోన్ కొనటానికి యిష్టపడలేదు. యిలా డబ్బులు తీసుకొని తనే నందనకి కొని యివ్వాలనే ఆలోచనని మహి కనిపెట్టిందేమోననిపించిందామెకి. తనకి కావాలని డబ్బులు తీసుకొని పిల్లలకి యేదో ఒకటి కొనిస్తుందని మహికి తెలుసు. తన చేతుల్తో తనకంటూ పెద్దగా ఏం కొనుక్కోదు. పండగలకి, పుట్టిన రోజుకి, పెళ్ళిరోజుకి పిల్లలంతా అమ్మా నాన్నలకి బట్టలు పెడతారు. తండ్రికి సంపాదన వున్నా మహి ప్రతినెల ఆమెకి పాకెట్­మని మూడువేలు చెక్ పంపిస్తుంది. యిలా కలిసినప్పుడు యేదో వొక అవసరాన్ని చూపించి ఆమె డబ్బులు అడిగినప్పుడల్లా మహి యిస్తుంది. రామచంద్రరావు ప్రతి నెల ఆమెకి మూడువేలు పంపిస్తాడు. అడిగినప్పుడు యిస్తుంటాడు. యెలా దేనికి ఖర్చు చేస్తుందని మహి యెప్పుడూ అడగదు.

అప్పట్లో చదువుకోడానికి ఇళ్ళల్లో వాళ్ళని వొప్పించాల్సిన పరిస్థితి. ఆడపిల్లలు వుద్యోగాలు చేయటం చాలా అరుదైన కాలం. ఆ కాలపు స్త్రీలలో చాలా మందికి తమకంటూ బ్యాంక్ అకౌంట్ లేదు. చెక్ రాయటానికి బ్యాంక్లో వాటిని డిపాజిట్ చేయడం, డబ్బు డ్రా చేయడం తెలీదు. వారి పేరు మీద చెక్బుక్, బ్యాంక్బుక్ లేవు. మహి కొన్నేళ్ళ క్రితం తల్లిని బ్యాంక్ కి తీసు కెళ్ళింది. ఆమె పేరు మీద అకౌంట్ వోపెన్ చేసింది. తన పేరు మీదున్న బ్యాంక్బుక్, చెక్బుక్ని చూడగానే వైదేహిగారి కళ్ళల్లో కనిపించిన మెరుపు మహికి అందమైన జ్ఞాపకం. అప్పట్నుంచి మహి తను యిచ్చే డబ్బులని తల్లి పేర చెక్ రాసి పంపిస్తుండేది.

“చెక్ బుక్ రాగానే మీ అమ్మ నా మాట వినట్లేదమ్మా.” నవ్వుతూ అన్న తండ్రిని చూసి, “డబ్బులున్నంత మాత్రాన లెక్కచేయని పరిస్థితి వుందా మాకు,” చివాలున జవాబు చెప్పారు వైదేహి.

బిల్ రాగానే పే చేసి బయటికి వచ్చారు. వైదేహిగారిని మాధవి యింట్లో దిగబెట్టింది మహి. అప్పటికి మాధవి, భాస్కర్ ఆఫీసుల నుంచి యింటికి వచ్చారు.

“నందూ యింకా రాలేదా,” అడిగారు వైదేహి.

“ఆ పార్టీ యెప్పటికి అవుతుందో… ఆ బండి, ఫోన్ అని ప్రాణం తీస్తుందనుకో. అబ్బా యేదైనా బుర్రలోకి వస్తే చాలు అవి యిచ్చేవరకు వూరుకోదు. యింటర్నెట్ కనెక్షన్ పెట్టమని యెప్పట్నుంచో అడుగుతుంది. యివాళ అదో గోల,” నవ్వుతూ అంది మాధవి.

“చెల్లికి కొనిస్తే తనకి కావాలని కార్తీక్ పేచీ పెడుతున్నాడు. యిద్దరికి వొకేసారి యెక్కడవుతుంది,” అన్నాడు భాస్కర్.

“ఆ… మొగపిల్లలదేముంది… యెలాగైనా కొనుక్కుంటారు. ఆడపిల్లలకి కొనాలి. వాళ్ళకే చెయ్యాలి,” చప్పున అన్నారు వైదేహి.

“నువ్వొకదానివి, వాడు విన్నాడంటే బేర్ మంటాడు.” గట్టిగా నవ్వుతూ అంది మాధవి. వైదేహి తనకి మహి చెవులకి కొన్నవి బయటికి తీసి చూపించలేదు. మహి కొనిచ్చినవి యెవరికీ చూపించదు. డబ్బులు యిస్తుందని చెప్పదు. మహి నుంచి తీసుకుంటే యెవరైనా యేమైనా అనుకొంటారని భయం. అయితే పూర్తిగా వాటిని చూపించకుండాను వుండలేదు.

“వస్తున్నప్పుడు యేమైనా కొనుక్కోమని మీ నాన్నగారు డబ్బులిచ్చారు. యివి కొన్నా. యెలా ఉన్నాయి.” అని దుద్దులని మాధవికి, భాస్కర్­కి చూపించింది. బాగున్నాయని మెచ్చుకున్నారు. వాటిని మహి కొనిచ్చిందని మాధవి, భాస్కర్ గ్రహించారు. కానీ పైకి యేం తెలీనట్టుగానే వుండిపోయారు. యిప్పుడే చెప్పకపోతే యేం. వాళ్ళు యేం అనుకొంటారు, తను చెప్పొద్దనుకొందనుకోరా… మహికి నవ్వొచ్చింది.

మాధవి, భాస్కర్, అమ్మా మిగిలినవాళ్ళు యెవరేం అనుకొన్నా పెద్దగా తనకొచ్చే సంతోషం, బాధ యేంలేదు. గత పదేళ్ళుగా తను యిలాంటివి యెన్ని చూడలేదు. మిగిలిన పిల్లలు యేం కొన్నా వాళ్ళు కొన్నారని చెబుతుంది. వొకరి కంటే వొకరు యెంత గొప్పగా చూసుకొంటారో చెబుతుంటుంది. వింటున్న వాళ్ళు మిగిలినవాళ్ళ కంటే బాగా చూసుకోవాలనే చిన్న ఆందోళన, పట్టుదల, పంతం వుంటాయి. కానీ మిగిలినవాళ్ళు యెవరూ బట్టలు పెట్టటం తప్ప పెద్దగా కొనిచ్చింది. డబ్బులిచ్చేది లేదు. మహీ, రామ చంద్రరావు తప్ప. వైదేహిగారే తిరిగి వాళ్ళకి యిస్తుంటారు. యెగ్జిబిట్ చేయకూడదనే ధోరణి కంటే మహిని, మహి జీవితాన్ని ఆమోదించామని యెవరూ అనుకోకూడదనే తలంపుతోనే ఆ యింట్లో యెవ్వరూ, ఆమె నుంచి తీసుకొన్న డబ్బులు, వస్తువులు లేదా ఆమె యిచ్చిన వాటి విషయం యెక్కడా యెవ్వరితో మాట్లాడరు. యెగ్జిబిట్ చేయటంపై మహికి ఆసక్తి లేదు. కానీ యిక్కడ జరుగుతోంది. తనంటే వుండే వ్యతిరేకత వల్ల. తనని వొప్పుకోలేనితనం. అందుకని మాట్లాడరు. ఆ… పోనీలే… అమ్మే కదా… నాన్నే కదా… అక్కే కదా… అన్నే కదా… పిల్లలే కదా… అనుకొంటూ తను చేయగలిగింది చేస్తుంటుంది.

‘నందూకి సెల్ కొనివ్వచ్చు కదా. డబ్బులుండి యివ్వదు.’ అనుకొంది మాధవి.

మహిని అడిగి తీసుకొన్న డబ్బులు, ఆమె యిచ్చిన చిన్ని గిఫ్ట్స్ యెప్పుడూ మాధవికి గుర్తుండవ్. యేం చేశావ్ అనే వుంటుందామె ధోరణి.

“నందూకి నాన్నగారు బండి కొంటానన్నారు. యేది కావాలో కనుక్కో మన్నారు. డబ్బులు పంపిస్తానన్నారు.” అన్నారు వైదేహి. అవి మహివా, నాన్నగారివా అని వో క్షణం మాధవికి, భాస్కర్కి సందేహం వచ్చింది.

మహి యింటికి బయలుదేరింది.

చైత్రకి కాల్ చేస్తే… డ్రైవ్ చేస్తూనే చైత్రకి కాల్ చేయటమా, మానటమా అని ఆలోచిస్తోంది.

( ఇంకా ఉంది…)

error: Content is protected !!