పాటపై మాట
పాటపై నా మాట: ముసుగు వెయ్యొద్దు మనసు మీద
-కవనమాలి
ఈ పాట గురించి మనం మాట్లాడుకునేముందు అసలు ఈ పాట నాకెందుకు ప్రత్యేకమో చెబుతాను.
కమర్షియల్ లెక్కల అవసరమో, సృజనాత్మక కథనంలో కాసేపు విరామం కోసమో స్పెషల్ సాంగ్ అనేది తెర మీదకి వచ్చిందనిపిస్తుంది. అందులో కూడా చాలావరకు గమనిస్తే ఈ స్పెషల్ సాంగ్ అనేవి స్త్రీల దుస్తులు, హావభావాలు, శరీర ప్రదర్శన ముఖ్యంగా సాగుతూ, అదే ట్రెండ్ అనే తప్పుడు ధోరణిని కొనసాగించడం కూడా గమనిస్తుంటాము. ఈ ఆలోచన ధోరణిలో కొందరు ఈ పాటలని ఐటెం సాంగ్స్ అంటూ పిలుస్తారు కూడా.
ఇలాంటి పాటలు ఇన్నాళ్ల భారతీయ, తెలుగు చలన చిత్రాలలో కొన్ని వేలు ఉన్నా, అందులోని సాహిత్యం దాదాపు శృంగారపరంగా సాగినవే అని మనకి తెలుసు.. అలాంటి పాటలకి భిన్నంగా ఇలాంటి ఒక పాటని కూడా ఇంత అర్థవంతంగా చైతన్యవంతంగా రాయొచ్చు అని సిరివెన్నెల గారు ఈ ముసుగు వెయ్యొద్దు అనే పాట ద్వారా నిరూపించారు. కావాలంటే మీరే చూడండి.
సినిమా పేరు ఖడ్గం. కథాంశం దేశంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎదురుకునేందుకు ఇక్కడి మనుషుల్లో ఉండాల్సిన ఐక్యతాభావం. అటు మంచిలోనైనా ఇటు చెడులోనైనా ముఖ్యపాత్ర పోషించేది యువతే. ఇక ఈ పాట సందర్భం ఒక పబ్ లో అమ్మాయి పాడుతూ నాట్యం చేస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి ఇలాంటి సినిమాలో ఇలాంటి సందర్భంలో అప్పటివరకూ ఉన్న ఐటెం సాంగ్ ట్రెండ్ ఫాలో అవుతూ పాట రాయడం సులువా లేక, ఆ కథాంశానికి బలాన్నిచ్చేలా యువతలో ఉన్న చైతన్యాన్ని తట్టిలేపే పాటని రాయడం సులువా. ఆ సాహసాన్ని చేసారు సిరివెన్నెల గారు. అందుకు ఉదాహరణగా ఈ పల్లవి చదివి చూడండి.
‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా…‘
నూటికి ఎనభై కుటుంబాల్లో యువతని సంఘం నిర్మించిన సూత్రాల మీదే జీవితాన్ని నడపాలని ఒక శాసనం. అయితే ఆ సంఘం ప్రతీ వీధికి, ప్రతీ ఊరికి, ప్రతీ రాష్టానికి ఇలా అక్కడక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల మారుతూ ఉంటుందని అందరికీ తెలిసిన ఒక పరదాని మనసుపై కప్పుకొని కళ్ళు ఉన్నా చూడనట్టు నటిస్తూ జీవించమంటారు. అదే వద్దంటారు సిరివెన్నెలగారు ఈ పాటలో. ఎగిరే వయసులో, ఆకాశాన్ని తాకాలన్న ఆశతో ఉండే యువత రెక్కలని విరవొద్దని, చుట్టూ ఉన్న అందరి అభిప్రాయాలతో కాదు, నీ అనుభవాలతో నీ జీవితాన్ని నిర్మించుకో అని మనలో మనం దాచిపెట్టిన అసలైన మనని ఈ పల్లవితో కేకేసి మరీ పిలిచి లేపుతారు.
పల్లవిలో పరదాలని, ప్రభావాలని దాటి చూడు అంటూ భుజం తట్టిన సిరివెన్నెల గారు, మొదటి చరణంలోకి వచ్చేసరికి కొన్ని ప్రశ్నలు వేస్తారు.
‘సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్లముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు…’
ఇందులోని ప్రతీ ప్రశ్న తార్కికంగా మనని నిలదీస్తూనే, వీటికి సమాధానాలు మనకెప్పుడో తెలుసు, కాకపోతే ఆచరణలో పెట్టడానికి ఆలోచిస్తున్నావు అని గుర్తుచేస్తుంది.
“అన్నీ అనుకున్నట్టు జరిగితే నీకంటూ చెప్పుకోడానికి కథేం ఉంటుంది చెప్పు. ఆశలు ఉండాలి, అవి అందుకోవడంలో అడ్డంకులు ఉండాలి. అవి దాటే పట్టుదల నీకున్నప్పుడే కదా, ఫలితం పొందాక చెమట కూడా చల్లగా నీకు తృప్తిని ఇస్తుంది. అయినా ఇలా ఆలోచనల్లో ఇలాగే ఉండిపోతే, ఉన్న వయసు నిన్నొదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి త్వరపడు” ఇదే ఈ పాటలోని, చాలా సిరివెన్నెల గారి పాటల్లోని చైతన్యసారం.
ఇక రెండో చరణం నాకు చాలా చాలా ఇష్టం. పల్లవిలో స్టేట్మెంట్స్ పాస్ చేసినా, మొదటి చరణంలో ప్రశ్నలు వేసినా, ఈ రెండో చరణంలో మాత్రం లైఫ్ తాలూకు ఫిలాసఫీని ఎంతో సింపుల్ గా అర్థమయ్యేలా భలే చెప్పారు శాస్త్రిగారు.
‘కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం…’
బతుకంతా అప్పులు చేసి తీర్చే హడావిడిలో, అవసరానికి మించిన ఆస్తులు పోగేసుకునే ఆరాటంలో మన చుట్టూ మనం గోడలు కట్టేసుకుని, అందులోంచి మనం బయటికి రాకుండా, బయటి నుండి లోనికి ఎవ్వరినీ రానివ్వకుండా చేస్తూ.. ఇష్టం, ప్రేమ, స్నేహం, సానుభూతి ఇలాంటి అనుభూతులు మనలో ఒకప్పుడు ఉండేవి అనే స్థాయికి ఎక్కడ పడిపోతామో అని శాస్త్రిగారు బాధపడి ఈ చరణం రాసారేమో అనిపిస్తుంది. పుట్టుకలో చావులో ఒంటరితనం తప్పించలేం కానీ బతకడంలో మాత్రం ఒంటరితనం ఎందుకురా, చుట్టూ కలిసి బతకడానికి ఇంతమంది ఉండగా అనే ప్రశ్న ఈ పాటలోని చివరి వాక్యాలు విన్నప్పుడు నాకు అనిపించింది.
ఈ పాట కొందరి కమర్షియల్ లెక్కల్లో ఐటెం సాంగ్ అవునో కాదో నాకు తెలియదు కానీ, నా వరకూ ఈ పాట నిజంగా స్పెషల్ సాంగ్. ఎప్పుడైనా డల్’గా అనిపిస్తే, వినాలనుకునే పాటల్లో ఇదొకటి.
మరి మీలో ఎందరికీ ఈ పాట ఇష్టం? ఒకవేళ కుదిరితే మీకు ఇలా బాగా నచ్చిన పాటల గురించి మీకు తోచిన ఓ నాలుగు మాటలు మాతో పంచుకోండి.
ఈ పాట మీరు ఇక్కడ వినచ్చు : https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk








