పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
ఈరోజు మనం మన తెలుగు భాషలోని ఇంకొక సరదా రకం పద్యాల గురించి మాట్లాడుకుందాం! అవే “సమస్యా పూరణలు”! పేరు కొంచెం గంభీరంగా ఉన్నా, ఇవి ఇచ్చే చమక్కులు అంతా ఇంతా కావు.
ఇదెలా ఉంటుందంటే… పద్యం చెప్పే కవులకు ఒక సమస్య ఇస్తారు (ఛాలెంజ్ లాగా) ఇస్తారన్నమాట. ఉదాహరణకి ఒక పద్యానికి నాలుగు లైన్లు( దాన్నే నాలుగు పాదాలు అంటారు) ఉంటాయి అనుకుందాం ? ఈ సమస్యని ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, చివరి లైన్ (నాలుగో పాదం) మాత్రం ఇచ్చి, అది కూడా ఎలా పడితే అలా కాదు, అసంబద్ధంగానో, అసాధ్యంగానో అనిపించేలా ఉంటుంది. ఉదాహరణకి “ఆకాశంలో చేపలు ఎగురుతున్నాయి” అన్నట్టుగా!
ఇప్పుడు కవిగారి ప్రతిభ ఏంటంటే… ఆ అసంబద్ధంగా అనిపించే చివరి పాదానికి సరిపోయేలా, పై మూడు పడాలని అప్పటికప్పుడు అల్లి, మొత్తం పద్యాన్ని అర్ధవంతంగా, అందంగా మార్చేయాలి! అంటే, ఆ చివరి లైన్ ఎందుకు సరిఅయ్యిందో ( ఒక విధంగా జస్టిఫై చేస్తూ ), ఏ సందర్భంలో అది సాధ్యమవుతుందో పై మూడు లైన్లలో చెప్పాలన్నమాట. ఇలా చేయటానికి వాళ్ళకి మంచి ఊహాశక్తి, భాషా పటిమ, పురాణాల జ్ఞానం, ముఖ్యంగా హాస్యచతురత, సమయస్ఫూర్తి ఉండాలి! భలే ఉంది కదా ఛాలెంజ్? అదొక రకమైన పొయెట్రీ పజిల్ లాగా అనుకోవచ్చు!
సరే, ఇప్పుడు మనం ఒక క్లాసిక్ ఉదాహరణ చూద్దాం, అప్పుడు మీకే ఇంకా బాగా అర్థమవుతుంది!
మనకి ఇచ్చిన సమస్య (అంటే ఆ చివరి, వింతైన లైన్) ఏంటి? అంటే “గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.”
17వ శతాబ్దంలో మోచర్ల సోదరులుగా పేరుపొందిన కవులు వెంకన్న, దంతప్పలు. వీరి నివాసం నెల్లూరు జిల్లాలో తెట్టు గ్రామం. వేజెళ్ళ సంస్థానంలో ప్రసిద్ధి పొదిన కవులు వీళ్ళు. వీరి పేరుతో వందకు పైగా చాటు పద్యా లున్నాయట. సమస్యాపూరణంలో దిట్టలు వీళ్ళు. ఎవరో దత్తప్పకు “గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్” అనే సమస్యను ఇచ్చారట. ండ్ర అనే దుష్కర ప్రాసతో పద్యం చెప్పడం చాలా కష్టం. ( ఇక్కడ ప్రాస అంటే రైమింగ్ లాంటిది అనమాట … ండ్ర అక్షరం తో ఆఖరి పాదం ఉంది కాబట్టి అన్ని పాదాలు అలానే మొదలవ్వాలి ఛందస్సు లో. ఇలా కష్టమైన ప్రాస ఇచ్చారు కాబట్టి ఇది దుష్కర ప్రాస. తెలుగు భాషలో ‘ండ్ర’ అనే సంయుక్తాక్షరంతో మొదలయ్యే పదాలు కానీ, రెండో అక్షరంగా వచ్చే పదాలు కానీ చాలా అరుదు. కవులకు ఇది నిజంగా ఒక సవాలు, ఒక గండ్రగొడ్డలి లాంటిది!)
ఇప్పుడు అస్సలు సమస్యకి వద్దాం,
“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.”
అంటే, ఒక గుండ్రాయికి కాళ్ళు వచ్చేసి, అది గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయిందట! అదెలా సాధ్యం? రాయికి కాళ్ళు రావడం ఏంటి? నడవడం ఏంటి? వింటుంటేనే నవ్వొస్తుంది కదా? అసాధ్యం అనిపిస్తుంది కదా?
దంతప్పగారు ఆ సమస్యని ఇలా పూరించారు:
ఉండ్రా యోరి దురాత్మక!
యిండ్రా ప్రాసమ్ము కవుల కియ్యఁ దగున?కో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్.
మొదటి రెండు లైన్లు అర్థం చూస్కుంటే (“ఉండ్రా ఓరి దురాత్మక! ఇండ్రా, ఓరీ దుర్మార్గుడా ఇలాంటి ప్రాస కవులకివ్వచ్చా?”) బహుశా ఆ సందర్భాన్ని నాటకీయంగా చెప్పడానికో, లేదా పద్యం యొక్క ఛందస్సు (యతి, ప్రాస) కోసమో కవిగారు రాసి ఉండొచ్చు, కానీ అసలు సమస్యకు పరిష్కారం మూడో పాదంలో దాగి ఉంది!
“కోదండ్రాము పదము సోకిన” – అంటే, కోదండం ధరించిన శ్రీరాముడి పాదం తగలగానే… ఏం జరిగింది?
ఆ “గుండ్రాతికి” (ఆ గుండ్రాయికి) – ఇక్కడ గుండ్రాయి అంటే అక్షరాలా రాయి కాదు! గౌతమ మహర్షి భార్య అహల్య, శాపం వల్ల రాయిగా మారి ఉంటుంది కదా? ఆ అహల్య అనే శిల అన్నమాట!
రాముడి పాదం తగలగానే, ఆ అహల్య శాపవిమోచనం పొంది, తిరిగి తన నిజరూపం (స్త్రీ రూపం)లోకి మారి, “కాళ్ళు వచ్చి” (అంటే మనిషిగా కాళ్ళు వచ్చి) “గునగున నడిచెన్” (అంటే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది).
చూశారా? ఎక్కడో అసాధ్యంగా అనిపించిన “రాయి నడిచింది” అనే వాక్యాన్ని, రామాయణంలోని అహల్య శాప విమోచన ఘట్టంతో ఎంత అద్భుతంగా ముడిపెట్టి, అర్ధవంతంగా మార్చేశారో!
ఇదీ సమస్యాపూరణం అంటే! మన తెలుగు కవుల తెలివితేటలకు, చమత్కారానికి, పాండిత్యానికి ఇదొక నిదర్శనం!
భలే ఉంది కదూ!
మళ్ళీ ఇంకో పద్యంతో ఒచ్చే సంచికలో కలుద్దాం అప్పటి దాకా సెలవు