కాసేపు కవిత్వంలో…
సామాన్యుడి కథ
- -చక్రవర్తి గౌడ్ వీరమల్లు
ఇది ఒక సామాన్యుడి కథ!
ఆశను ఆత్యాశ అనుకుని, నిరాశే నిజమనుకునే ఒక వెర్రివాడి వ్యధ
జీవితం ఒక తెల్ల కాగితమని వాడూ నమ్మాడు
కానీ వాడి పేజీలను ఇంకెవ్వడో నింపేస్తుంటే
చదువుతూ ఉండిపోయాడు
ఒక చేతిలో కలం పట్టుకుని ఎక్కడన్నా
ఆ పేజీలో ఖాళీ దొరికితే, కోరికల చిట్టా నింపుదాం
అని ఆశతో చూస్తున్నాడు మన వాడు
అదేంటో వాడు సముద్రమైనా ఈదగలడు…
కానీ అది సముద్రమనే ఆలోచన వస్తే మాత్రం
అందులో అస్సలు దూకలేడు!
ఎవరో రాసిన నియమాలు ఇంకెవరో వదిలేసిన ఆదర్శాలు
ఇవే వాడికి మార్గదర్శకాలు
ఆ రాసిన వారు, వదిలేసిన వారు కూడా వీడిలా మనుషులే అని తెలిసినా
ఇలాగే ఎందుకని ఎవర్నీ ఇబ్బంది పెట్టని మంచి వాడు పాపం.
ఇంకెంత మంచివాడంటే వాడి గురించి నలుగురు ఏమనుకుంటారోనని
వారికి శ్రమ కలిగించకూడదని చెప్పుకోదగ్గ ఏ పనికి పూనుకోడు పాపం!
అందరికి వాడి కథ తెలిసినా
కొందరికి కూడా వాడు ఎవ్వడో తెలీదు
అందుకే వాడి కథ రాస్తున్న… నీకు వాడు కనిపిస్తే ఇది చూపించు
చదివి ఊ కొడతాడో లేక కలం పట్టుకుని కొత్త కథ రాసుకుంటాడో ఇక వాడి ఇష్టం.








